
ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఓర్వలేకనే బిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నామని, అయినా కలర్, డిజైన్ బాగాలేదని బిఆర్‌ఎస్ వాళ్లు విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. సహజంగా ఆడవాళ్లు ఎదుగుతుంటే కెటిఆర్, హరీశ్‌రావులు ఓర్వలేరని మంత్రి సీతక్క విమర్శించారు. ఆడబిడ్డలు చీరలు తీసుకొని సంబరపడుతుంటే వారు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు.
బిఆర్‌ఎస్ మాదిరిగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదని, సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కావాలంటే కెటిఆర్, హరీష్‌రావు, కవితలు స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను అడిగి తెలుసు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. కొందరు బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా ఉందన్నారు. చీరలను మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు అవా స్తవమని మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.




