
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండ్రులతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యాంను సందర్శనకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. చెక్ డ్యాంలను ఇసుక మాఫియా బాంబులతో కూల్చివేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక కోసం చెక్ డ్యాంను బాంబులతో పేల్చివేసిన దుండగులు రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మాఫియాకు అండదండగా ఉంటూ వారిని ప్రోత్సహించడం వలనే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. చెక్ డాం పేల్చివేయడంతో సుమారు 20,000 ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయిందని అన్నారు. సుమారు 24 కోట్లు పెట్టి కట్టిన చెక్ డ్యాం పేల్చివేశారని వెంటనే వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చెక్ డ్యాం పేల్చి వేసిన వారి నీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 24 కోట్లు వసూలు చేయడంతో పాటు శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కట్టడాలను కట్టారని, కాంగ్రెస్ పాలనలో వాటిని కూల్చడం మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు. ఇసుక మాఫియా టెర్రరిస్టులను మించిపోయారని, రైతుల పంటలకు అవసరమయ్యే నీటిని వృధా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పేల్చివేసి మూడు రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కూల్చిన వారిని గుర్తించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా అంటూ హేలనచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అని చెక్ డ్యాంల కింద ఉన్న కాలువలను తవ్విస్తే మరిన్ని లక్షల ఎకరాలకు నీళ్లు రైతులకు అందించవచ్చు అని అన్నారు.
పెద్దపల్లి ప్రాంతంలోని హుస్సేన్ మియ చెక్ డాం కూల్చి వేసినప్పుడే పట్టించుకుంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. కెసిఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తాగునీరు, సాగునీరు అందించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తానని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన ఒక్క లక్ష ఎకరాల కూడా నీళ్లు అందించడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిన ఇప్పటివరకు మరమ్మత్తు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాలేశ్వరం కూలింది అన్నప్పుడు కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 8వేల కోట్లు వెచ్చించి హైదరాబాదులోని మూసీలో కి నీళ్లు తీసుకువస్తానని ఎలా చెప్పారని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండు పిల్లర్లు కూడా ఇలానే కూలాయని మాకు అనుమానం వస్తుందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కూలినప్పుడు కూడా ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయని అక్కడున్న ప్రజలు చెప్పారని అన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో కాపర్ డ్యాం నిర్మాణం చేసి సుమారు 20వేల ఎకరాలకు నీళ్లు అందించాలని సూచించారు. చెక్ డ్యాం సందర్శనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహన్ రెడ్డి లతోపాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




