
పెర్త్: ది యాషెస్ సరికొత్త సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్షం. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కి 205 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఇంగ్లండ్. ఈ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. తనదైన శైలీ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ హెడ్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు.
కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను హెడ్ బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్‌లో (ఛేజింగ్) అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా హెడ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. 1902లో అతడు ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లో శతకం సాధించాడు. 123 ఏళ్ల తర్వాత ఈ రికార్డును హెడ్ బద్దలుకొట్టాడు. అంతేకాక.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును సమం చేశాడు హెడ్.




