
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కెసిఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పుల వల్లే ఇప్పుడు హామీల అమల్లో కొంత జాప్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పు కంటే పదింతల అప్పులు చేసి రాష్ట్రాన్ని కెసిఆర్ అంధకారంలోకి నెట్టేశారని మంత్రి జూపల్లి ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తాము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు గతంలో ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం చీరలు తయారు చేయించిందన్నారు. మహిళా సంఘాల్లో లేని మహిళలకు సైతం చీరలు అందుతాయని, కొల్లాపూర్‌లో సరిగ్గా రోడ్లు కూడా లేవని గతంలో చంద్రబాబు నాయుడు హేళన చేశారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా కిరణ్‌కుమార్ రెడ్డిని పట్టుబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించామని ఆయన పేర్కొన్నారు.




