
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణా నదిలో ప్రయాణించాలనుకునే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ నేటి నుంచి పర్యాటక శాఖ మళ్లీ అందుబాలోకి తీసుకురానుంది. గతంలోనూ ఈ జర్నీ అందుబాటులోకి వచ్చినా కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. మళ్లీ తిరిగి ఈ ప్రయాణం నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణ పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇవ్వనుంది.
100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా లాంచీ ఏర్పాటు
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా పిల్లలకు 2,600 రూపాయలుగా ధర ఫిక్స్ చేశారు. అయితే, కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా టూరిజం శాఖ ధర నిర్ణయించింది. అయితే, లాంచీలో సాగర్ నుంచి నంది కొండ మీదుగా ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అందాలను ఎంజాయ్ చేసేలా ఈ ప్రయాణం ఏర్పాటు చేశామని టూరిజం అధికారులు వెల్లడించారు. నదిలో 110 కిలోమీటర్ల దూరం ఆరుగంటల ప్రయాణంలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ప్రతి శనివారం టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభిస్తామని పర్యాటశాఖ అధికారులు తెలిపారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.




