
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు… రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్‌రావు ప్రకటన విడుదల చేశారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా… భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా…? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని విమర్శించారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతామని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు..కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి… ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు.రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు…? అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.




