
హైదరాబాద్: బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడం వల్ల కెటిఆర్ పై చట్టం ప్రకారం చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు ఉంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేవాళ్లమని, చట్ట ప్రకారమే ఈ-కార్ రేసింగ్ కేసులో ముందుకెళ్తామని మహేష్ గౌడ్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధించాలన్న ఆలోచన లేదని అన్నారు.కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు విచారణ చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలి? అని మహేష్ కుమార్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పోదని, కక్షసాధిస్తే మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే జైల్లో ఉండేవారని అన్నారు. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా శిక్ష అనుభవించాల్సిందేనని, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఉంటే 6 నెలల ముందే గవర్నర్ అనుమతి వచ్చేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓటమితో బిజెపికి దిమ్మతిరిగే గవర్నర్ అనుమతి ఇచ్చిందని, బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే ఉందని స్పష్టంగా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నా.. బిసి రిజర్వేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. చట్టంపై అవగాహన లేకుండా బండిసంజయ్ మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.




