
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో తన నెం.1 ర్యాంకును కోల్పోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్ (782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్‌మాన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో ఉన్నారు. ఇక ఒక్కో స్థానం మెరుగై శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో, కెఎల్ రాహుల్ 16వ స్థానంలో స్థిరపడ్డారు.
ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా డారిల్ మిచెల్ రికార్డు సృష్టించాడు. 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. మార్టిన్ క్రోవ్, ఆండ్రూ జోన్స్, రోజర్ ట్వోస్, నాథన్ ఆస్టిల్, కేన్ విలియమ్‌సన్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్ వంటి ఆటగాళ్లు టాప్-5లో స్థానం సంపాదించినా.. నెం.1 ర్యాంకును మాత్రం చేరుకోలేకపోయారు.




