
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకొని మావోలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.




