
మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్న బంద్‌కు సీపీఎం మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరుగుతుంటే తెలంగాణలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడం దారుణమని 8 నుంచి 12 శాతం మించి ఉంటే పత్తి కొనుగోలు చేయమని కపాస్ కిసాన్ యాప్ ద్వారా మార్కెట్‌కు తెచ్చే పత్తి పంటను తేదీని స్లాట్ బుక్ చేయాలని నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
గ్రామాల్లో రైతులు స్మార్ట్ ఫోన్ల పట్ల ఎంత వరకు అవగాహన కలిగి ఉన్నారని ప్రశ్నించారు. వర్షాల వల్ల పత్తిలో 18 శాతం తేమ వస్తుందని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 12 శాతం మించి వస్తుందన్నారు. సీసీఐ ఆంక్షలతో పత్తిని కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మే దుస్థితి వస్తుందని క్వింటాళుకు రూ. 2000 వేల చొప్పున నష్టపోతున్నామన్నారు. సీసీఐతో ప్రయివేటు వ్యాపారులు కుమ్మయ్యారని వచ్చిన లాభాలను వారే పంచుకుంటున్నారన్నారు. పత్తి పంటపై సుంకాన్ని 20 శాతం పెంచాలని, పత్తిపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని పత్తి రైతులను ఐక్యం చేసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పొదల నాగరాజు, కడారి ఆంజనేయులు, కడారి ఐలయ్య, కాసాని పుల్లయ్య, పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.




