
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్‌ను లక్షంగా ఉగ్రవాద ముఠాలకు మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల గురించి ప్రపంచానికి ఆధారాలు చూపించామని, చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని పాక్‌కు గట్టిగా హెచ్చరించారు. బ్లాక్ మెయిళ్లకు భయపడే స్థితిలో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశం లోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారన్నారు. ఆర్టికల్ 37ం తరువాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. గతం కన్నా ఇప్పుడు పొరుగుదేశ మైన చైనాతో భారత్ సంబంధాలు బలపడుతున్నాయని ద్వివేది పేర్కొన్నారు.




