
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాప్తి చెందడంతో మరో కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




