Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedచిరు ధాన్యాలతోనే చక్కెర వ్యాధికి చెక్

చిరు ధాన్యాలతోనే చక్కెర వ్యాధికి చెక్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జంక్, ప్రాసెస్‌డ్ ఆహారం అనేక రోగాలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేరనీయని చిరుధాన్యాలు అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేక మంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చిరు ధాన్యాలు అంటే చిన్న గింజలు కలిగిన తృణధాన్యాల సమూహం. వీటిలో జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు వంటివి ప్రధానమైనవి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఫైబర్, పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి మరియు జీవనశైలి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆధునిక యుగం మనిషి జీవితంలో వేగాన్ని పెంచింది. గడియారంతో పోటీ పడుతూ తీవ్ర ఒత్తిడి మధ్య పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో మనిషి అనేక ముఖ్య విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రధానంగా ఆరోగ్యాన్ని నిర్దేశించే తిండి, నిద్ర విషయంలో సమతౌల్యం లోపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్ల మధ్య వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేసే జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండెజబ్బులు సహా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అయితే కొవిడ్‌కు ముందు వరకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మాత్రం క్రమంగా మార్పు రావడం ఆరంభమైంది. ప్రజల్లో ఆరోగ్య, పోషహాకార స్పృహ పెరిగింది. ఫలితమే విస్తృత పోషకాలు కల్గిన చిరుధాన్యాలకు ఆదరణ పెరగడం.

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తూ ఉండడంతో ప్రస్తుతం అనేక మంది ప్రజలు చిరుధాన్యాలతో చేసిన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైనా కానీ డయాబెటిస్ అదుపులో ఉండాలన్నా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహార పదార్థం మనం తీసుకున్నపుడు అది మనకు ఎంత తొందరగా అబ్సార్బ్ అయ్యి ఎంత తొందరగా గ్లూకోస్‌ని శరీరంలో విడుదల చేస్తుందనే దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. షుగర్స్‌లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అబ్సార్షన్ స్లోగా జరిగి షుగర్‌ని స్లోగా రిలీజ్ చేస్తుందని అనే కంట్రోల్ మేనర్‌లో ఫుడ్ తీసుకోవాలి. మధుమేహం రాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి మిల్లెట్స్ ఉత్తమం.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు : మిల్లెట్స్‌ను చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు అని అంటారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, అరికెలు, అండు కొర్రలు, సామలు, ఊద్లు, ఉలవలు వంటి వాటిని మిల్లెట్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరి ధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు. తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి. వీటిలో మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. గోధుమల కంటే 3 నుంచి 5 రెట్లు పోషకాలు కలిగిఉంటాయి. బి విటమిన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉండడంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి.

వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జొన్న అంబలి, రాగి జావ, ఉలవచారు, మక్కగట్క, సామల ఉప్మా, కొర్రల కిచిడీ, పాయసం, జొన్న రొట్టె, గుడాలు, సూప్, చిరుధాన్యాల మిశ్రమ పిండితో రొట్టెలు, బజ్జీలు, బిర్యానీ, వడ, ఉప్మా, కట్లెట్, కీర్, ఇడ్లీలు, దోశ తయారు చేసి విక్రయిస్తుండటం, ఇళ్లలోనూ వీటివాడకం క్రమంగా పెరుగుతోంది. మురుకులు, బిస్కెట్లు తదితరాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలను ప్రతిరోజు తింటే మనిషికి ఎన్నడూ జబ్బు చేయడని నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ కాలంలో పండే పంటలు. మిగతా పంటలతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల వాడకమూ తక్కువే. ఇవి వర్షాధారితంగా ఎక్కువ పండుతాయి. రసాయనాలు లేకపోవడం, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారికి చిరుధాన్యాలు వరదాయినిగా మారాయి.సకల పోషకాలు కలిగిన పదార్థాలు కాబట్టి మిల్లెట్స్ కు అంత ప్రాధాన్యం ఉంది. మిల్లెట్స్ ను ప్రజలు ప్రధానంగా రొట్టెలు, దోశలు, సూప్‌లు, అన్నం లాగానే తయారు చేసుకుని తింటారు. వీటిని కడిగి నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే ఇది సూక్ష్మ పోషకాల జీవలభ్యతను అందిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. చిరు ధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

 

మిల్లెట్స్‌తో ప్రయోజనాలు ఇవీ : ఆలస్యంగా జీర్ణమవటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభిస్తుంది. వీటిల్లో చక్కెర పదార్థాలు తక్కువగా ఉండగా టైప్ 2 చక్కెరవ్యాధి నిరోధానికి దోపదపడతాయి. చిరుధాన్యాల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటు తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు పిల్లల్లో ఎదుగుదలకు సాయపడతాయి. నాడీవ్యవస్థ సక్రమ పనితీరుకు, పాస్పరస్ శరీర కణాల పెరుగుదలకు, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి దోహదడపతాయి. వీటిలోని నయాసిస్ అనే బి-విటమిన్ బ్లడ్‌లోని చెడుకొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి వల్ల గుండెసంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి. పేగుసంబంధిత క్యాన్సర్లు, అల్సర్లు ఏర్పడే అవకాశాలను సైతం తగ్గిస్తుంది. ఊబకాయం, మలబద్దకం, తిమ్మిరి, ఉబ్బసం వంటివి రాకుండా సహకరిస్తాయి. సామలలో ఎక్కువగా ఖనిజ లవణం, ఇనుము ఉండటంతో మహిళల్లో రక్కహీనతను నివారిస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా అధిక పీచుపదార్థం కాపాడుతుంది.

డా. చేతన్ రెడ్డి కెబి

కన్సల్టెంట్ ఫిజీషియన్‌, క్రిటికల్ కేర్ నిపుణుడు

సింధు హాస్పిటల్, హైటెక్ సిటీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments