
హైదరాబాద్: జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటాం అని.. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు అని.. నిర్విరామంగా కష్టపడిన కెసిఆర్ బృందానికి ధన్యవాదాలు అని.. కెటిఆర్ తెలియజేశారు. ప్రజల వాదన, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బిఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారని అన్నారు. ఈ ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం కాంగ్రెస్ ఇచ్చిందని, ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ అని ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలా పనిచేసిందో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఏడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం అని.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని, నిరాశ పడాల్పిన అవసరం లేదని ఇంకా ముందుకెళ్దాం అని.. కెటిఆర్ సూచించారు.




