
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్‌ని తీసుకొని అతనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కర్రన్‌లను ట్రేడ్ చేస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేసేందుకు ఏం చేయాలో టీం ఇండియా మాజీ ఆటగాడు అశ్విన్ సిఎస్‌కెకి సలహా ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీశ్ రాణాను, కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. అయ్యర్ మూడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెనర్లుగా వస్తే బాగుటుందని.. మూడో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ లేదా నితీశ్ రాణా బ్యాటింగ్‌కు రావాలని అన్నాడు. బ్రెవిస్, శివమ్ దూబె నాలుగు, ఐదు స్థానాల్లో వస్తే బాగుంటుందని తెలిపాడు. కెమెరూన్ గ్రీన్‌ను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని.. అతడు ఇటీవల ఆసీస్ తరఫున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు.
‘వెంకటేశ్ అయ్యర్ చెపాక్‌లో ఒకటి, రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. స్వీప్, రివర్స్ స్వీప్ చక్కగా ఆడుతాడు. ఇక నితీశ్ రాణా అయితే స్వ్కేర్ బౌండరీలను బాదగలడు. అందుకే వీరిద్దరిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఐపిఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే, వదిలేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలని బిసిసిఐ గడువు విధించింది.




