
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(61) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆయన ప్రకటించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను బాగానే ఉన్నా. వర్కౌట్లు ఎక్కువ చేయడం వల్ల అలసిపోయా. వర్కౌట్ల కన్నా.. యోగా, ప్రాణాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది’’ అని ఆయన తెలిపారు. గత నెల నుంచి గోవిందా చాలా బిజీగా ఉంటున్నారని.. అందువల్ల ఇలా జరిగి ఉండొచ్చని గోవిందా స్నేహితుడు, లాయర్ బిందాల్ తెలిపారు. వైద్యులు గోవిందాకు విశ్రాంతి అవసరమని సూచించారని.. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారని వివరించారు. మంగళవారం అర్థరాత్రి స్పృహ కోల్పోయిన గోవిందాను జుహులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని గంటల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు.




