
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్ గూడ డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లో పొన్నం డోర్ టూ డోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాలు గురించి ఆరా తీశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక్కొకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 కి గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఆర్ టిసి లో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పొన్నం వివరించారు. అనంతరం కాపు సంఘ నాయకుల నివాసంలో అల్పాహార సమావేశం జరిగింది. కాపు సంఘాలు నవీన్ యాదవ్ కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి.




