
కోయంబత్తూరు: తమిళనాడులో సంచలనం సృష్టించిన పీజీ స్టూడెంట్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఎన్కౌంటర్ జరిపి నిందితులను పట్టుకున్నారు. కోయంబత్తూరులో సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో బాధితురాలిని అపహరించిన ప్రదేశానికి సమీపంలో ఓ బైక్ ను పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రదేశం, బాధితురాలి స్నేహితుడి కారుకు దగ్గరగా ఉంది. దీంతో సిసిటివి ఫుటేజ్‌లను ఉపయోగించి పోలీసులు అనుమానితులపై నిఘా పెట్టారు.
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. నిందితులు కోయంబత్తూరు సమీపంలోని వెల్లైకనార్ శివారు ప్రాంతంలో దాక్కున్నారని ప్రత్యేక పోలీసు బృందానికి తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సంఘటనాస్థలానికి చేరుకుని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై ముగ్గురు నిందితులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ గాయపడ్డాడు. ఆకస్మిక దాడి కారణంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో గాయపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన నిందితులను తవాసి, కార్తీక్, కైలైశ్వరన్‌గా గుర్తించారు. నిందితులపై ఇప్పటికే ఐదు కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.




