
వేరు వేరు భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువచేస్తున్న ఛాయ, ఈసారి బెంగాలీ సాహిత్యం వేస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపుర చరిత్రలో 80వ దశకం ఒక నెత్తుటి జ్ఞాపకం. నాటి పరిణామాలను ప్రముఖ బెంగాలీ రచయిత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సమరేశ్ మజుందార్ తన రచనల ద్వారా భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేశారు. త్రిపుర నేలపై జరిగిన సాయుధ పోరాట ప్రభావాలను నవల రూపంలో అక్షరీకరించారు. ‘ఇంత రక్తపాతం ఎందుకు? ‘పేరుతో ఆ నవలను ఆర్.వి. లక్ష్మీదేవి తెలుగులోకి అనువదించారు.
త్రిపుర బ్రిటిష్ కాలంలో స్వయంప్రతిపత్తి గల రాజ్యంగా ఉండేది. త్రిపురను పాలించిన రాజులు 19వ శతాబ్దపు చివర్లో, ఆధునిక విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆశయంతో బెంగాల్ నుండి విద్యాధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఆహ్వానించారు. తూర్పు బెంగాల్ ప్రాంతం (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి అధికంగా వ్యవసాయ పనికి శిక్షణ పొందిన రైతులు, కూలీలు త్రిపురకు వలస వచ్చారు. దేశ విభజన నేపథ్యంలోనూ తూర్పు బెంగాలీలు పెద్దఎత్తున వలస వచ్చారు. ఫలితంగా అరణ్య భూములు వ్యవసాయ భూములుగా మారాయి.
ఈ వలసలు త్రిపురపై బలమైన ప్రభావం వేశాయి. మరోమాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశం లో విలీనమైన త్రిపుర తన చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను పోగొట్టుకుంది. క్రమంగా బెంగాలీ ల ప్రాబల్యం పెరిగింది. కోర్టులు, పాఠశాలలు, కార్యాలయాల్లో బెంగాలీ మౌలిక భాషగా మారిం ది. వలసలతో భూ వినియోగం, నివాస, సాగు వంటి విషయాల్లో స్థానికులపై ఒత్తిడి పెరిగింది. అప్పటివరకు స్థానికుల చేతుల్లో ఉన్న వనరులు క్రమంగా వలసదారుల చేతుల్లోకి మారాయి. అనతికాలంలోనే త్రిపురలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా భారీగా పడిపోయింది. వలసల కారణంగా ఆదివాసీయేతర జనాభా భారీగా పెరిగింది. వలసదారుల జనాభా వేగంగా పెరగడం, రాజకీయ, పరిపాల న, వాణిజ్యం, విద్య, ఉద్యోగాల్లో వారి ఆధి క్యం పెరగడంతో స్థానిక మూలవాసుల్లో అసంతృప్తి పెరిగింది. త్రిపుర ఆర్థిక వ్యవస్థ లో వ్యవసాయం కీలకమైంది. అలాంటి చోట ప్రభుత్వ భూములపై వలసదారులు స్థిరపడడంతో తమ జీవనాధారం కోల్పుతున్నామనే భావన స్థానికుల్లో పెరిగింది. వలసల వల్ల తమ జీవనాధారం దెబ్బతినడంతో పాటు, తన సంస్కృతి కూడా మాయమవుతోందనే భావన పెరిగింది. ఇందుకు అసమ అభివృద్ధి కూడా మరో కారణం.
ఈ నేపథ్యంలో 1980లలో త్రిపుర మూలవాసుల ఆధ్వర్యంలో బెంగాలీ ఆధిపత్య వ్య తిరేక ఉద్యమం పెల్లుబికింది. అది క్రమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది. ఫలితంగా హింస పెచ్చరిల్లింది. స్థానికులకూ, స్థానికేతరుల కూ మధ్య మొదలైన ఘర్షణ చరిత్ర చెక్కిలిపై నెత్తు టి జ్ఞాపకాన్ని మిగిల్చింది. నేటికీ ఆ ఉద్రిక్తతలు వేరువేరు రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. నేటికీ ప్రాసంగికత గల ఈ రచనను తెలుగు పాఠకులకు అందజేస్తున్నది ప్రచ్ఛాయ.




