
హీరో ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్ గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా చూపించడం జరిగింది. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని హాస్యంతో, మనసుని హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా చూపించారు. ప్రేమంటే అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ప్రియదర్శి-, ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా ఉంది.ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.




