
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఉంచిన అత్యంత క్లిష్టమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ మూడో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తలపడుతుంది. వరుస ఓటమలుతో సతమతమైన టీమిండియా ఒక దశలో సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. కానీ కీలకమైన మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌ను ఓడించడంద్వారా అడ్డంకులను తొలగించుకుని నాకౌట్ రేసులో నిలిచింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా అసాధారణ ఆటను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పాలి.
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి విధ్వంసక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన నేపథ్యంలో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అసమాన్య పోరాట పటిమతో భారత్‌కు అండగా నిలిచారు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వీరు కొనసాగించిన చిరస్మరణీయ బ్యాటింగ్‌ను ఎంత ప్రశంసించిన తక్కువే. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను వీరు సమర్థంగా ఎదుర్కొని జట్టును ముందుకు నడిపించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో భారత్‌ను సురక్షిత స్థితికి చేర్చింది.
హర్మన్ అండతో జెమీమా చారిత్రక ఇన్నింగ్స్‌ను ఆడింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ వీరు సాగించిన పోరాటం అద్వితీయం. భారత క్రికెట్ చరిత్రలోనే హర్మన్, జెమీమా బ్యాటింగ్ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి. ఏడు సార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టీమ్ ఈ సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఊహించినట్టే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ముందు అత్యంత క్లిష్టమైన 339 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందని అందరూ భావించారు. కానీ టీమిండియా అందరి అంచనాలను తారుమారు చేస్తూ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సెంచరీ చేజార్చుకున్నా జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకంతో భారత్‌కు విజయం సాధించి పెట్టింది. దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్‌లు కూడా కీలక ఇన్నింగ్స్‌లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపు భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో మరింత విశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




