Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedముంచెత్తిన మొంథా

ముంచెత్తిన మొంథా

మన తెలంగాణ / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య ఇది తీరం తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేదిపాలెంలో మొంథా తుపాను రాత్రి 8గంటల సమయంలో తీరం తా కింది. భీకరంగా దూసుకువస్తున్న తుపాను విశా ఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి 75,802 మందిని అక్కడికి తరలించింది. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లుతోపాటు 321 డ్రోన్లను సర్కారు అందుబాటులో ఉంచింది.

కూలిన చెట్లు తొలగించేందుకు 1040 భారీ వుడ్ కట్టింగ్ మెషీన్స్ సిద్ధం చేసింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని అలానే మరి కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా బలహీనపడి బుధవారానికి తుపానుగా మారుతుందని స్టెల్లా వివరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో రాత్రి 8.30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిలిపివేసింది. కోస్తాంధ్ర తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమతమైంది. తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

18 విమానాలు, పలు రైళ్లు రద్దు

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవంర నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రద్దయిన వాటిలో విశాఖపట్టణం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 5 విమానాలు ఉన్నాయి. మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ లోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. 107 రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం ఒక రైలును రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు, రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.

6 రైళ్లు దారి మళ్లింపు, 18 రైళ్ల సమయాల్లో మార్పులు

హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నిడదవోలు, నర్సాపురం, భీమవరం, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దు అయ్యాయి. 6 రైళ్లను దారి మళ్లించినట్లు 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వివరించారు. రద్దైన రైళ్ల వివరాలను రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు పంపింది. ఆయా ప్రయాణికులకు టికెట్ మొత్తం తిరిగి చెల్లించనుంది. మరోవైపు ఏపీలోని విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.

ఎగిసిపడుతున్న రాకాసి అలలు

తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ ఈ గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది.

బస్ సర్వీసులు రద్దు

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్. ఒక్కసారిగా ప్రయాణికులు లేక వెలవెలబోయింది. మెుంథా తుపాన్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజులతో పోలిస్తే నేడు టికెట్ల బుకింగ్స్ సగానికి సగం తగ్గాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments