Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedకర్నూలు ఘటనలో 19 మృతదేహలు గుర్తింపు

కర్నూలు ఘటనలో 19 మృతదేహలు గుర్తింపు

ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సంచనల విషయాలు బయటపెట్టిన ఎర్రిస్వామి

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు నిర్ధారణ

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

బస్సు ప్రమాదానికి, బైక్ యాక్సిడెంట్‌కు మధ్య అదే దారిలో వెళ్లిన మరో రెండు బస్సులు

19 మృతదేహాలు గుర్తింపు..15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కర్నూలు బస్ ప్రమాద ఘటనకు కారణమైన మృతుడు శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి చేసిన ఫిర్యాదుపై ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శివశంకర్ నిర్లక్షంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి తాను పోలీసులకకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బండి నడిపే ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్టు ఎర్రిస్వామి ఫిర్యాదులో వెల్లడించారు. ఎర్రిస్వామి హైదరాబాద్‌లో చెత్త సేకరించే, ప్రాసెస్ చేసే పనిచేస్తారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. శనివారం సాయంత్రమే ఎర్రిస్వామిని ప్రమాద స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి రికార్డు చేసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దీంతో పాటు రవాణా రంగానికి సంబధించిన నిపుణులను కూడా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలన చేశారు. బస్సు ప్రమాదానికి గురైన రోజు రాత్రి జరిగిన ఘటనపై ఎర్రిస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపు కున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను పక్కకి తీయాలని అనుకున్నాడు. శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు మంటల్లో చిక్కుకోవడం చూసిన ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడు.

19 మృతదేహాలు గుర్తింపు.. 15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

ఈ ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక మృతదేహం మినహా మిగతా డెడ్‌బాడీస్‌ను డీఎన్‌ఏ టెస్టుల అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు తీసుకున్న చర్యలు, తుది నివేదిక వివరాలను కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్‌పి వెల్లడించారు. వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదంలో చనిపోయిన వారి మృత దేహాలు తీవ్రంగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడం కష్టమైంది. ఈ క్రమంలో ఎపి ప్రభుత్వం మృతదేహాలకు, వారి కటుుంబసభ్యులకు డిఎన్‌ఎ టెస్టులు నిర్వహించింది. ఆ నివేదిక ఆధారంగా గుర్తించి వాటిలో 15 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. మరో నాలుగు మృతదేహాలను బంధువులు రాగానే అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ జరిగింది. త్రిమూర్తి హైదరాబాద్‌కు వచ్చి రిజర్వేషన్ లేకుండా ఆరంగర్ సర్కిల్ వద్ద బస్సు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అలా బస్సు ఎక్కిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు మొబైల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ అతను అందుబాటులోకి రాలేదు. దానితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కర్నూలుకు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత ఆ అంతుచిక్కని 19వ వ్యక్తికి డిఎన్‌ఏ టెస్ట్ జరిపి అమృతదేహం త్రిమూర్తిదే అని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో బస్సు దుర్ఘటనలో మరణించిన మొత్తం 19 మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

ప్రమాదానికి గల కారణాలపై నెలకొన్న అనుమానాలపై ఎస్‌పి విక్రాంత్ పాటిల్ స్పందించారు. ఈ ప్రమాదంపై జరిగిన విచారణలో భాగంగా వచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో తేలినట్లు స్పష్టం

బైక్ డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు. ’సిసి వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్ష లో అదే నిజమని తేలింది’ అని పోలీసులు తెలిపారు. ”ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. మృతుడి విస్సెరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది” అని కర్నూలు ఎస్‌పి ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments