
హైదరాబాద్: తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ఇల్లు సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు. నీకింత, నాకింత అనే సెటిల్‌మెంట్లు తప్ప.. రాష్ట్రంలో పాలన లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారని, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారని అన్నారు. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడూ జరగలేదని చెప్పారు.
ఒక మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సిఎం అనుచరుడు రోహిన్ రెడ్డి బెదిరించారని, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెబుతున్నారని, బెదిరించింది వాస్తవమేనని పోలీసులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఈ అంశంపైన స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. సిఎంకు తన పరిపాలన పైన, మంత్రుల పైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాంత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారని చెప్పారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారని ఆరోపించారు. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం ఉద్దరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పిసిసి ప్రెసిడెంట్ సన్మానం చేశారని అడిగారు.




