
బిఆర్‌ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం
బిజెపికి బి టీంగా బిఆర్‌ఎస్ పని చేస్తోంది
బిఆర్‌ఎస్‌కు ఓటమి తథ్యం
మంత్రి సీతక్క వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజా స్పందన చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమేనని అన్నారు. బోరబండలో గురువారం మంత్రి సీతక్క విస్తృత ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్వలేక బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పేర్కొన్నారు. బిజెపికి బీ టీమ్ గా బిఆర్‌ఎస్ పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అబద్దాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్‌కు ఓటమి తధ్యమని అన్నారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఓటర్లే స్వయంగా చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారని తెలిపారు.




