Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedఇది రేవంతుద్దీన్ సర్కారు: బిజెపి చీఫ్ రాంచందర్ రావు

ఇది రేవంతుద్దీన్ సర్కారు: బిజెపి చీఫ్ రాంచందర్ రావు

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా..?

గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామన్న ప్రభుత్వం

గోవులను కోసేవాళ్లకు ఇప్పుడు గన్ లైసెన్సులు ఇస్తున్నారా?

తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి చీఫ్ రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను పాలిస్తున్నది రేవంత్‌రెడ్డి సర్కార్ కాదని, రేవంతుద్దీన్ సర్కార్ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. తాజా సంఘటనలు చూస్తే అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా..? లేదా..? అనే అనుమానం వస్తోందని అన్నారు. రాష్ట్రంలో గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటనల విడుదల చేశారు. గోవులను రక్షిస్తున్న ప్రశాంత్ సింగ్ పై అభాండాలు వేస్తారా?, గోవులను కాపాడుతున్న ప్రశాంత్ పై హత్యాయత్నం చేసినవారిని కాపాడే ప్రయత్నమే ఇది అంటూ మండిపడ్డారు.

ప్రశాంత్ (సోనూ సింగ్)పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తక్షణమే బాధ్యులైన ఎంఐఎం గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా..? నిన్న గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా

గోరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి మెమోరాండం అందించేందుకు బయల్దేరిన క్రమంలో, నాతో పాటు సుమారు 100 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో, ఎంఐఎంకు చెందిన గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్న బిజెపి అధ్యక్షుడు ఈ ఘటనపై తాము డీజీపీతో మాట్లాడటానికి వెళుతుంటే అరెస్ట్ చేయడం అన్యాయమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గోవులను తరలించే గుండాలు, మాఫియా రెచ్చిపోతోందని పేర్కొన్నార. గోరక్షకులపై అనేక దాడులు పెరిగాయని దానికి పరాకాష్ట ఇదేనని వెల్లడించారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ (సోనూ సింగ్)ను కాల్చి చంపే ప్రయత్నం చేయడమేనని అన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు వైపు ఆలోచిస్తున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో, బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments