Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedబస్తీ దవాఖానాలకు సుస్తీ

బస్తీ దవాఖానాలకు సుస్తీ

మనతెలంగాణ/హైదరాబాద్/శేరిలింగంపల్లి: సిఎం రేవంత్‌రెడ్డికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ ముఖ్యనేతలు బస్తీ దవాఖానాలను పరిశీలించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవ ర్గం ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను కెటిఆర్,శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి బ స్తీ దవాఖానను హరీష్ రావు సందర్శించి డాక్టర్లతో రోగులతో మాట్లాడారు. సరైన సమయానికి జీతాలు కూడా రావడం లేదని డాక్టర్లు ,మందులు కూడా అందుబాటులో లేవని రో గులు వారికి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ నగరం చెత్తా చెదారంతో నిండిపోయిందని, ఉచితంగా వైద్య పరీక్షలు 

అందించే టీ -డయోగ్నోస్టిక్స్‌ను పక్కన పెట్టేశారని ఆరోపించారు. బస్తీ దవాఖానాల వైద్యులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతోపాటు దానికి అనుబంధంగా ఆసుపత్రి కూడా నిర్మించామని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. బస్తీ దవాఖానల్లో సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిన బస్తీ దవాఖానల్లో సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాము 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మరో 450 దవాఖానాలు ఏర్పాటు చేయాలని అన్నారు. టీమ్స్ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని, లేదంటే త్వరలో టీమ్స్ ఆసుపత్రుల వద్ద ధర్నా చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు.మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, వారికి ఇచ్చిన జీత పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది :హరీష్‌రావు

కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టిందని హరీష్‌రావు విమర్శించారు. బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ చేసి నయం చేసే విధంగా బస్తీ దవాఖానాలు పనిచేశాయని అన్నారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దని,తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానలను కెసిఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్లమని, 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి రోగుల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని చెప్పారు. ఆరు నెలల నుండి జీతం రావడం లేదు, స్టాఫ్ నర్స్ దేవమ్మకు ఐదు నెలల నుండి జీతం రాలేదని ఆన్నారని పేర్కొన్నారు. సపోర్టింగ్ స్టాఫ్‌ని అడిగితే ఆరు నెలల నుంచి జీతం రాలేదని అన్నారని చెప్పారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదని ఆరోపించారు. బస్తీ దవాఖనలో మందులు సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే సమీక్ష చేసే తెలివి రేవంత్ రెడ్డికి లేదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలను కోరారు. సిఎం తన కిట్టీ నిండుతోందా.. లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడే కెసిఆర్ కిట్ల గురించి ఆయనకు ఎందుకు..? అని అడిగారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానను పరిశీలించిన మాగంటి సునీత

యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానను బిఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పరిశీలించారు. ముషీరాబాద్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లోని బస్తీ దవాఖానాను ఎంఎల్‌ఎ ముఠాగోపాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రోగులు వైద్య సిబ్బందితో వేరువేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ బస్తీ దవాఖానాను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌సి తక్కెలపల్లి రవీందర్ రావు సందర్శించి రోగుల పడుతున్న ఇక్కట్లను తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్‌లో బస్తీ దవాఖానను సందర్శించి పేషంట్స్,వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ రసూల్‌ఫురలోని బస్తీ దవఖానలో వసతులు ఎలా ఉన్నాయో బిఆర్‌ఎస్ నేత క్రిశాంక్ పరిశీలించారు. అంబర్‌పేట గంగానగర్ బస్తీ దవకానాను ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్ సందర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రేమ్ నగర్ బస్తీ దవఖానను ఎంఎల్‌సి వంటేరు యాదవ్ రెడ్డి, ఎంఎల్‌ఎ సునీత లక్ష్మారెడ్డి సందర్శించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. షేక్‌పేట బస్తీ దవాఖానను మాంజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సి డాసోజు శ్రవణ్, పరిశీలించారు. కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు కుప్ప కూలే పరిస్థితి దాపురించిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బస్తీ దవాఖానాల్లో పరిస్థితులు మారాలని లేదంటే బిఆర్‌ఎస్ పత్యేక కార్యాచరణ కు పుంజుకుంటుందని హెచ్చరించారు .

మా ఎంఎల్‌ఎ పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం సిగ్గుచేటు : కెటిఆర్

తమ పార్టీ ఎంఎల్‌ఎ పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐసిసి అంటే ‘ఆలిండియా కాంగ్రెస్ కమిటీ’ కాదని, అది ‘ఆలిండియా కరప్షన్ కమిటీ’ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బిఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ పేరు ఉండటాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. తమ పార్టీ ఎంఎల్‌ఎలు ఎవరు కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్న కాంగ్రెస్, అదే సమయంలో తమ ఎంఎల్‌ఎ పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం సిగ్గుచేటు అని, ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నీతి, రీతి ఏమైనా ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎంఎల్‌ఎలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి చేర్చుకుందని, ఇది అవినీతి కాదా..? అని నిలదీశారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎలు స్పీకర్ వద్ద ఒకలా, బయట మరోలా మాట్లాడుతున్నారని, అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో వారు ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కెటిఆర్ సవాల్ విసిరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments