
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చారు. రష్యా ముడి చమురు కొనుగోలు నిలిపేసే వరకు భారత్ అధిక సుంకాలు చెల్లించక తప్పదని పేర్కొన్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు ప్రధాని మోడీ అంగీకరించారిని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అయినా.. ట్రంప్ మాత్రమే మళ్లీ అదే మాటా మాట్లాడుతున్నారు.
తాజాగా తన అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ త్వరలో రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తుందని.. మోడీ తనకు హామీ కూడా ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించడంపై విలేకర్లు ప్రశ్నించగా.. “వాళ్లు అలా చెప్పాలనుకుంటే.. భారీ సుంకాలను చెల్లిస్తూనే ఉంటారు.. కానీ అలా చేయరని అనుకుంటున్నాను” అని ట్రంప్ తెలిపారు. కాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై ట్రంప్.. మొదట 25 శాతం అదనపు సుంకాలను విధించారు. ఆ తర్వాత మొత్తం సుంకాలను 50 శాతానికి పెంచారు.




