
ఆదివారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు, సులభంగా విజయం సాధించే అవకాశం ఉన్నా.. ఓటమిపాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. దీంతో భారత్ పై ఇంగ్లాండ్ జట్టు 4 పరుగుల తేడాతో గెలపొంది సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడంతో అభిమానులు టీమిండియా ఆట తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
లక్ష్య చేధనకు దగ్గరగా వచ్చిన సమయంలో క్రీజులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(88)తోపాటు దీప్తి శర్మ(57)లు ఉన్నారు. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి.. చివరి పది ఓవర్లలో బాల్ టు బాల్ రన్ తీస్తే చాలు.. భారత్ విజయం సాధిస్తుంది. అందరూ ఇండియానే గెలుస్తుందనుకున్నారు. కానీ, అనవసరమైన షాట్లతో వికెట్లు కోల్పోయి.. చేజేతులా విజయాన్ని దూరం చేసుకున్నారు. దీంతో భారత్, ప్రపంచకప్ సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి.
ఇప్పటివరకు ఆడిన ఐదింట్లో రెండు మ్యాచ్ లోనే గెలిచిన భారత జట్టు, సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగే రెండు మ్యాచ్ ల్లోనూ తప్పక విజయం సాధించాలి. అయితే, బలమైన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై చేతులెత్తేసిన టీమిండియా.. న్యూజిలాండ్ పై గెలవడం అంత సులభం కాదు.ఒకటి ఓడిపోయినా టీమిండియా టోర్ని నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. మరి గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ తో భారత్.. ఇంటికా, ముందుకా అనేది తేలనుంది.




