
మన తెలంగాణ/హైదరాబాద్‌ః తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. నక్సల్స్ రహిత జిల్లాలకు మహర్ధశ పడుతుందని ఆయన అన్నారు. గత మూడు రోజుల్లోనే మూడు వందల మంది నక్సల్స్ లొంగిపోయారని, అందులో తెలుగు వారు ఎక్కువ మంది ఉన్నారని ఆయన ఆదివారం అంబర్‌పేటలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ అన్నారు. పదేళ్ళ క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్స్ ప్రభావిత జిల్లాలు, ఇప్పుడు 11కు తగ్గాయని అన్నారు. అవి కూడా నక్సల్స్ రహిత జిల్లాలుగా మారుతాయని, వాటికీ మహర్ధశ పడుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమొందించాలని కేంద్రం పట్టుదలగా ఉందని ఆయన వివరించారు.
‘ఆపరేషన్ కగార్‘తో సత్ఫలితాలు వస్తున్నాయని, ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. నక్సల్స్ ముందుకు వచ్చి హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. హింస ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే సందేశం మరోసారి స్పష్టమైందని ఆయన తెలిపారు. త్వరలోనే దేశంలో నక్సల్స్ రహిత జిల్లాలుగా మాతుతాయని ఆయన చెప్పారు.
ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు. నక్సల్స్ కారణంగా ఆ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా నోచుకోలేదని ఆయన చెప్పారు. నక్సల్స్ రహిత జిల్లాలుగా మారడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.




