
ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లోభారత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నైట్ 91 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 పరుగులు సాధించింది. ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ (22), అమీ జోన్స్ (56) జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (38) తనవంతు పాత్ర పోషించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు అద్భుత పోరాట పటిమను కనబరిచినా భారత్‌కు ఓటమి తప్పలేదు. మంధాన 8 ఫోర్లతో 88 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ 10 ఫోర్లతో 70 పరుగులు సాధించింది. దీప్తి శర్మ (57), హర్లిన్ డియోల్ (24)లు బాగానే బ్యాటింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.




