
‘బుల్లెట్ కన్నా .. బ్యాలెట్ గొప్పది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నక్సల్స్ తమ వాదనను బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఇటీవల నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగిపోవడం శుభపరిణామమని ఆయన తెలిపారు.ప్రజ్ఞాభారతి అధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో బహుముఖ ప్రజ్ఞాశాలి త్రిపురనేని హనుమాన్ చౌదరికి పంచ నవతి జన్మదినం సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాన్ని వెంకయ్య నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకుని ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోవడం సంతోషకరమని అన్నారు. బుల్లెట్ కన్నా, బ్యాలెట్ శక్తివంతం అని ఆయన తెలిపారు.
కాబట్టి వారి వాదాన్ని బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి వారి వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి మద్దతు కోరాలని ఆయన చెప్పారు. తుపాకి సంస్కృతితో సాధించేది ఏమీ లేదని ఆయన తెలిపారు. మావోయిస్టుల వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని ఆయన వివరించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, కుటుంబ వ్యవస్థ మన బలం అని ఆయన తెలిపారు. స్నేహ సంపద, కుటుంబ సభ్యులతో గడిపి సమయమే గొప్ప సంపద అని ఆయన చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుఓవడానికి యువతరం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, దానిని ఎవరికి ఆపడం సాధ్యం కాదన్నారు.
హనుమాన్ చౌదరికి జీవన సాఫల్య పురస్కారం అందజేయడం చాలా సంతోషంంగా ఉందన్నారు. హనుమాన్ చౌదరి భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవని అన్నారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొలి చైర్మన్‌గా, టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. అందరికీ ఆదర్శప్రాయులని ఆయన ప్రశంసించారు. మన పెద్దల స్పూర్తిని యువతరం అందిపుచ్చుకుని నవ భారత నిర్మాణంలో చోదక శక్తులు కావాలని ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.ప్రజ్ఞా పురస్కారాలు అందుకున్న నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్‌ను, కల్లోల భారతం పుస్తక రచయిత కోవెల సంతోష్ కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజ్ఞాభారతి సంస్థ తీసుకున్న చొరవలో ‘లోక్ మంథన్’ కార్యక్రమం మహోన్నతమైందని, తాను ఎంతో అభిమానించేదని ఆయన తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు అవగాహన కల్పించడంలో విజయవంతమైందని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ నందకుమార్, ప్రజ్ఞా భారతి అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.




