
తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బిసి రిజర్వేషన్లపై చర్చించిన మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ అనర్హతగా ఉన్న నిబంధనను మంత్రివర్గం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నా పోటీ చేయొచ్చని చెప్పారు. ఇక, కేంద్రం సహకరించకపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. నల్సార్ యూనివర్శిటీకి గతంలో ఇచ్చిన భూమి కన్నా అదనంగా మరో 7 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రంగాలకు భూములను కేటాయించాలని మంత్రివర్గం ఆమోదించిందని ఆయన తెలిపారు.




