
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచి అఫ్గాన్‌కు సిరీస్‌ను సాధించి పెట్టిన రషీద్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రషీద్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన సౌతాఫ్రికా స్టార్ కేశవ్ మహరాజ్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో, జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) నాలుగో ర్యాంక్‌ను సాధించారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గిల్ 784 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అఫ్గాన్ స్టార్ ఇబ్రహీం జద్రాన్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 ర్యాంక్‌లు ఎగబాకి ఏకంగా రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బంగ్లా సిరీస్‌లో రాణించడంతో ఇబ్రహీం ర్యాంక్ గణనీయంగా పెరిగింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ మూడో, విరాట్ కోహ్లి ఐదో, శ్రేయస్ తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.




