
కారు డ్రైవర్ ను మేమే చంపామని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసింది
పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం
న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ వినుత కోట వీడియో విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాయుడు అనే డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయాలు, భ్రమరాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం పాలకమండలి ఛైర్మన్ పదవి తదితర అంశాలను ప్రస్తావించారు. తన అభ్యంతరాలను తెలిపారు. తన నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. కారు డ్రైవర్ హత్య కేసులో వినుత కోటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
కొద్దిరోజుల కిందటే బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ షరతులకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హత్యకు గురైన కారు డ్రైవర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే కోట వినూత తాజాగా వీడియోను విడుదల చేయడం, అందులో పలు అంశాలను చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసైనికులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఓటర్లు, రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేయడానికి, మనసు నిండా పుట్టెడు బాధతో ముందుకొచ్చానని వాపోయారు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లినందుకు తమకు బాధగా లేదని, కారు డ్రైవర్ ను తామే చంపా మని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసిందన్నారు. అతని చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించడం వల్లే అరెస్టయిన 19 రోజు ల్లోనే బెయిల్ వచ్చిందని చెప్పారు.
విదేశాల్లో లక్షల రూపాయలు వచ్చే జీతాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల ప్రాణాలకు తీయడానికి కాదని కోట వినుత అన్నారు. ఈ హత్య కేసులో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని, కోర్టులో నిరూపించుకుని క్లీన్ చిట్ తో బయటికి వస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నందున ఇంత కంటే ఎక్కువ మాట్లాడదలచు కోలేదని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోన్నామని, పూర్తిస్థాయిలో బెయిల్ లభించిన వెంటనే త్వరలో ఆయనను కలుస్తానని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తనను రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయ త్నాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా తనపై జరిగిన కుట్రను బయటపెడతానని అన్నారు. మీడియా సమక్షంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని తెలిపారు.
చనిపోక ముందు డ్రైవర్ వీడియో కలకలం
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారని చెబుతున్న డ్రైవర్ రాయుడు పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బొజ్జల తన అనుచరుడు సుజిత్‌రెడ్డితో తనను సంప్రదించి కోట వినుత, ఆమె భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని సూచించినట్లు రాయుడు ఆరోపించాడు. వారి హత్యకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపాడు. 2024 ఎన్నికల కన్నా ముందే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ టిడిపి నేత బొజ్జల సుధీర్‌రెడ్డికి సహకరించారని వీడియోలో వెల్లడించాడు. గతంలో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అతడు సొంతంగా వీడియో రికార్డ్ చేశాడా, లేక భయపెట్టి వీడియో తీయించారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బెయిల్ పై వచ్చినంత మాత్రాన నిర్దోషులు కాదు: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐతో రూపొందించారా? వాస్తవమా? అన్నది తేల్చాలన్నారు. రాయుడు హత్య జరిగిన రెండు నెలల తర్వాత వీడియో విడుదల చేశారని, తనపై బురదజల్లడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నుంచి కోట వినుత దంపతులు తన గెలుపునకు సహకరించలేదని, ఇంటికి వెళ్లి ఓట్లు అడిగినా సరైన రీతిలో స్పందించలేదని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలసి కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు తాను చూడలేదని ఆయన చెప్పారు.
ఈ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడి వీడియో పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. బెయిల్ పై వచ్చినంత మాత్రాన నిర్దోషులు కాదని, న్యాయస్థానం హత్యలో ప్రమేయం లేదని తేల్చి చెప్పాలని బొజ్జల సుధీర్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.




