
చంఢీఘడ్‌లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన భట్టి
ఫోన్‌లో పరామర్శించిన సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : చండీఘడ్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం చంఢీఘడ్‌కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చి, పూరన్‌కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో డిప్యూటి సిఎం మాట్లాడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారని, పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. అధికారి సూసైడ్ నోట్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, న్యాయం జరిగేలా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన అధికారి వై పురాన్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి తాను చండీగఢ్‌కు వచ్చానని విక్రమార్క చెప్పారు. హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ మాజీ ఎస్పి నరేంద్ర బిజార్నియాతో సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ నోట్‌ను వదిలిపెట్టారన్నారు. ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆందోళనకరమైన విషయమని పురాన్ కుమార్ సూసైడ్ నోట్‌లో ఇద్దరు అధికారులను ప్రస్తావించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు.
హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, మాజీ రోహ్తక్ ఎస్పి నరేంద్ర బిజర్నియాలు తనను అవమానించడం తన ఆత్మహత్యకు మూల కారణమని పూరన్ కుమార్ పేర్కొనట్లు డిప్యూటి సిఎం వివరించారు. బిజర్నియాను శనివారం బదిలీ చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత, ఈ కేసుపై త్వరిత, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దేశంలోని చట్టం ప్రకారం, సాధారణంగా, సూసైడ్ నోట్‌ను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటారని, ప్రభుత్వం దానిపై వెంటనే చర్య తీసుకుంటుందన్నారు. దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగి చాలా రోజులు గడిచినా, ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని, మరణించిన అధికారి మృతదేహం పోస్ట్‌మార్టం లేకుండా అలాగే పడి ఉందని, కుటుంబం మృతదేహాన్ని చూడలేకపోతున్నారని ఇది అమానవీయం ఘటన అని ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ పోలీసులను డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ అనేక విజయాలు సాధించిన ఐపిఎస్ అధికారి అని, గర్వంగా జీవించడానికి ప్రయత్నించాడని డిప్యూటి సిఎం అన్నారు. అటువంటి వ్యక్లి క్షమించండి, నేను జీవించలేను, నేను చనిపోవాలి’ అని నిర్ణయించుకోవడం పట్ల మృతుడు అనుభవించిన మానసిక సంఘర్షణ మీరు ఊహించగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిని అర్థం చేసుకుని కుటుంబం తరపున నిలబడాలని డిప్యూటి సిఎం కోరారు. సూసైడ్ నోట్ ప్రకారం చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం గత ఏడు రోజులుగా ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోందని, అయినా ఎటువంటి స్పందన లేదని భట్టి ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, చట్టాన్ని కాపాడటం ఏ ముఖ్యమంత్రికైనా ప్రాథమిక బాధ్యతని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.




