
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్‌లు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే చైనాపై 30 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాణిజ్యంపై చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా , చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా, వాటికి సుంకాలు వర్తిస్తాయి ” అని అమెరికా అధ్యక్షుడు తన పోస్టులో వెల్లడించారు. ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని , ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపారు. నవంబరు 1 నుంచి లేదా ముందుగానే ఈ టారిఫ్‌లు అమల్లోకి రావచ్చన్నారు.
చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టి దీనిపై యూఎస్ నిర్ణయం ఉంటుందన్నారు. అలాగే క్రిటికల్ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్టు వివరించారు. అమెరికా తయారు చేసే దాదాపు ప్రతి ఉత్పత్తి పైనా భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోందనే నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ … భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ సుంకాల ప్రకటన చేయడం గమనార్హం. ఇక గతం లోనూ అమెరికాచైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్షంగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్‌కు ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ, అది ఓ కొలిక్కి రాలేదు.




