ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దెబ్బను రుచి చూసినా, పాకిస్థాన్ ప్రగల్భాలు మాత్రం ఆపట్లేదు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్‌తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. అయితే ఈసారి యుద్ధం వస్తే తాము అనుకూల ఫలితాలు సాధిస్తామంటూ బీరాలు పలికారు. పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“నేను ఉద్రిక్తతలను కోరుకోవట్లేదు. కానీ ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవం. భారత్‌తో యుద్ధం అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ ఈ సారి యుద్ధం జరిగితే … గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం” అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్‌కు ఇటీవల భారత్ ఆర్మీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి బదులిస్తూనే ఖవాజా ఈ విధంగా కవ్వింపులకు పాల్పడ్డారు.