రెండో భార్యను బండరాయితో అతికిరాతకంగా బాది హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఆలూర్ అనుబంధ గ్రామమైన వెంకన్నగూడలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సిఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..వెంకన్నగూడకు చెందిన బుడగ జంగయ్య 15 ఏళ్ల క్రితం మొదటి భార్య ఉండగానే రజిత (30)ను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, రజిత మూడేళ్ల క్రితం భర్తను వదిలేసి సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులో నివాసం ఉంటోంది. ఆర్‌సిపురం ఎన్‌ఐజి కాలనీలో జంగయ్య నివాసం ఉంటూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.ఏడాది క్రితం రెండో భార్య రజిత ఆచూకీ తెలుసుకుని ఆమెకు నచ్చజెప్పి మొదటి భార్యతో కలిసి ముగ్గురు ఒకేచోట ఉన్నారు. కొన్ని రోజులకే మళ్లీ వారితో కలిసి ఉండకుండా ఇంటి నుంచి చెప్పకుండా ఆమె వెళ్లిపోయింది.
రజిత ఆచూకీ దొరకడంతో సోమవారం ఆమెను తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. తనతో కలిసి ఉండేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాడు. గ్రామంలో ఓ పెద్ద మనిషి వద్ద పంచాయితీ పెట్టారు. అయినా రజిత అతనితో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై పగ పెంచుకుని ఆమెను హత్య చేసేందుకు పూనుకున్నాడు. మంగళవారం సాయంత్రం చిట్టెంపల్లి గేటు వద్దకు వెళ్లి మద్యం తీసుకుని గ్రామ శివారులో ఇద్దరూ కలిసి తాగారు. రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చున్నీతో భార్య మెడకు చుట్టి హత్య చేసి అక్కడే ఉన్న సిమెంట్ బండరాయితో బాదాడు. అనంతరం పిల్లలకు వీడియో కాల్ చేసి తల్లిని హత్య చేసినట్లు చూపించాడు. మాజీ సర్పంచ్‌కు ఫోన్ చేసి, తన రెండో భార్యను హత్య చేసినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.