గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. యువకులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద బుధవారం గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో కవిత పాల్గొని మాట్లాడారు. పారదర్శకంగా పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలే ఇచ్చారని విమర్శించారు. గ్రూప్-1 అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడాలని కోరారు. ఆయనను విద్యార్థులు నమ్మారని, వారి పక్షాన నిలబడాలని పేర్కొన్నారు. కోర్టుల్లో జడ్జీలకు అర్థం అయ్యేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 పరీక్షలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఫలితాల వరకు అన్నీ అవకతవకలే జరిగాయని పేర్కొన్నారు.
గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కాంగ్రెస్ కోసం గ్రూప్ 1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారని, కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికే గ్రూప్-1 పెట్టారా..? అని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చి వాళ్లనే సిఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల పేపర్లను బయట పెట్టమని పరీక్ష రాసిన అభ్యర్థులు అడుగుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తే కుర్చీలో నుంచి తీసి బయట పడేస్తారని హెచ్చరించారు. గ్రూప్ 1 అంశంపై గురువారం ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికావొద్దని హితవు పలికారు. ఉద్యోగాలు వచ్చిన వారిపై కోపం లేదు అని, అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే తమ కోపం అని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి 8 మంది ఆంధ్రా వ్యక్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వులపైన తాము ఉద్యమం చేస్తామని తెలిపారు.