హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎస్ ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కి గసగసాలు స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4.25 కిలోల గసగసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిటిలో కార్పెంటర్‌గా పని చేస్తూ మన్ని రామ్ అనే వ్యక్తి.. డ్రగ్స్ దందాకు తెరలేపాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పోలీసులు, ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కాగా, హైదరాబాద్ మహా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతుండటంతో.. దాన్ని అంతమొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు. సిటిలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో డ్రగ్స సరఫరా చేసే ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు.. ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.