
ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లారు. మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సిఎం రేవంత్ చర్చించినట్టుగా తెలిసింది. ఇటీవల ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతుండగా ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాట్ సర్జరీ చేసిన విషయం విధితమే. అందులో భాగంగా సిఎం బెంగళూరుకు వెళ్లారు. తిరిగి రాత్రి 10.30 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చారు.




