పిజి మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలి
ప్రస్తుత పిజి నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త జిఒ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పిజి వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయంపై తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో పిజి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న స్థానిక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వందలాది సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. పిజి మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పిజి సీట్లు అందుబాటులో ఉండగా, అందులో సగం రాష్ట్ర కోటా కింద భర్తీ అవుతాయని తెలిపారు. ఈ రాష్ట్ర కోటాలోని 25 శాతం, అంటే సుమారు 450 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయని వెల్లడించారు.
అయితే, ఈ సీట్లలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించకపోవడంతో అవన్నీ ఓపెన్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల వారికి దక్కుతున్నాయని హరీష్ రావు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానికులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే, 450 సీట్లలో కేవలం 68 సీట్లు మాత్రమే ఇతర రాష్ట్రాలకు వెళతాయని, మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభిస్తాయని వివరించారు. ప్రస్తుత విధానం వల్ల మన విద్యార్థులు ఈ విలువైన అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మొద్దు నిద్ర విడాలి
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారని హరీష్‌రావు తెలిపారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు చేసి, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల 520 ఎంబిబిఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయని అన్నారు. బి కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ వల్ల 1300 సీట్లు ప్రతి సంవత్సరం అదనంగా లభించాయని, మొత్తంగా 1,820 అదనపు ఎంబిబిఎస్ సీట్లు ప్రతి ఏటా తెలంగాణ విద్యార్థులకు లభించాయని వివరించారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చిన ప్రాధాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక పోవడం శోచనీయం అని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వైద్య విద్యార్థులకు జరుగుతున్న నష్టం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడి, మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన పిజి ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేసి, కొత్త జిఒ జారీ చేయాలని హరీష్‌రావు తన లేఖలో కోరారు.