మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని విశాఖలో యారాడ సముద్ర తీరంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగిన ఇటలీకి చెందిన ఓ పర్యాటకులు మృతి చెందాడు. గాజువాక పరిధిలోని యారాడ బీచ్‌కి సందర్శనకు వచ్చిన 16 మంది ఇటలీ దేశస్థుల్లో ఇద్దరు సముద్రంలో ఈతకు దిగగా అలలు రావడంతో కొట్టుకుపోయారు. అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని మెరైన్ పోలీసులు, జివిఎంసి లైఫ్ గార్డులు ముందుగానే హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఇది గమనించిన జివిఎంసికి చెందిన లైఫ్ గార్డ్ అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరినీ సముద్ర తీరం నుంచి కాపాడి ఒడ్డుకు చేర్చారు. కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.
అయితే, వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సిపిఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విదేశీ పర్యాటకుడి మృతి తో యారాడ తీరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన వ్యక్తి ఇటలీ దేశస్థుడనని అధికారులు వెల్లడించారు. మరో వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పర్యాటకులు సముద్రంలో ఈతకు దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపితమైంది. యారాడ బీచ్‌లో తరచూ అలలు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండటంతో ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.