చెన్నై: ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలను వాయిదా వేస్తున్నట్లు విజయ్ తెలిపారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. అయితే విజయ్ పర్యటనను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని టివికె ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొక్కిసలాటలో ఆత్మీయులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే రెండు వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. పర్యటనలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మా నేత ఆమోదంతో తెలుపుతున్నాం’’ అని టివికె హెడ్‌క్వార్టర్స్ సెక్రటేరియట్ ప్రకటించింది.