
నగర శివార్లలో చైన్‌స్నాచర్లు మళ్లీ విజృంభిస్తున్నారు. ఒంటిరి మహిళలను టార్గెట్ చేస్తూ మరీ బంగారు గొలుసు లు అపహరించుకుని ఉడాయిస్తున్నారు. హయత్‌నగర్ అంజనాద్రి నగర్లో విజయ అనే మహిళ మెడలో 3.3 తులాల పుస్తెల తాడును దుండ గులు లాక్కెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మణమ్మ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసుని ఎత్తుకెళ్లారు. చైతన్యపురి ఆర్కేపురంలో ఆదిలక్ష్మీ అనే మహిళ మెడ నుంచీ 1.5 తులాల గోల్డ్ చైన్ తెంపుకుని ఉడాయించారు. దుండగులు పల్సర్ బైక్‌లో వస్తూ మహిళల మెడలోంచి పుస్తెలతాడు ను తెంపుకుని అంతే శరవేగంతో ఉడాయిస్తున్నారు. ఈ విధంగా వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఒంటరిగా మహిళలు రోడ్డుపై వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. రెక్కీ నిర్వహించి మరీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని చైన్‌స్నా చింగ్‌లకు చైన్ స్నాచర్లు పాల్పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలను చైన్స్నాచర్లను ఎంచుకుని మరీ మహిళల మెడల్లో పుస్తెలతాడును తెంపుకుపోతున్నారు.
ఇటీవల చైన్‌స్నాచింగ్‌లు తీవ్రతరమవుతుండటం.. ఈ మేరకు బాధితులు పోలీసుస్టేషన్ల లో ఫిర్యా దులు వెల్లువెత్తుతుండటం పోలీసులకు చైన్‌స్నాచర్స్ ముఠాలు సవాల్ విసిరినట్లుగా చెబుతున్నారు. గతంలో చైన్‌స్నాచింగ్ ఘటనలు పెచ్చరిల్లిన సమయంలో పోలీసులు యాంటీ చైన్‌స్నాచింగ్ బృందాలను ఏర్పరిచి చైన్‌స్నాచర్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసిన సందర్భాలు లేకపోలే దు. అయితే, ఇటీవలి కాలంలో మళ్లీ చైన్‌స్నాచర్స్ ముఠాలు పడగ విప్పడం పోలీసులను ఉలికిపాటుకు గురిచేశాయని చెబుతున్నారు. నగర శివార్లు, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలనే ఎంచుకుని మరీ చైన్‌స్నాచింగ్ ముఠాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చైన్‌స్నాచర్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో చైన్‌స్నాచింగ్‌కు తెగ బడ్డ ముఠాలే మళ్లీ విజృంభిస్తున్నాయా? లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరికొత్త చైన్‌స్నాచర్స్ ముఠాలు రంగంలోకి దిగాయా? అన్నదాని పై పోలీసులు దృష్టి సారించారు. దుండగుల, ముఠాల ఆచూకీని గుర్తించేందుకు ఘటనాస్థలం, పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటివి దృశ్యాలను పోలీసులు వీక్షి స్తున్నారు.
ఆయా దుండగుల రాకపోకలను నిశిత దృష్టితో పరిశీలిస్తున్నారు. త్వరలోనే చైన్‌స్నాచర్స్ ముఠాల గుట్టును రట్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మార్నింగ్ వాక్కు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకో వాలని సూచిస్తున్నారు. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించకుండా ఉంటే మంచిదని పోలీసులు తెలిపారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానా స్పద ద్విచక్ర వాహనాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు.




