
బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో చోటుచేసుకుంది. వివరాలలో్కి వెళితే.. కొల్లాపూర్ పట్టణానికి చెందిన రాముడు, ఎల్లమ్మ దంపతుల కూతురు వరలక్ష్మీ(19), మొల్లచింతపల్లికి చెందిన రజిత కూతురు లావణ్య(12) ఇద్దరు కలిసి మంగళవారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు బావి వద్దకు వెళ్లారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ అభించలేదు. బుధవారం ఉడయం కొందరు పొలం వద్దకు వెళ్తుండగా బావి దగ్గర బట్టలు కన్పించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనస్థలికి చేరుకొని బావిలో వెతకగా ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




