
కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు క్రీడా శిక్షణా విద్యార్థినులు గురువారం ఒక గదిలో ఉరి వేసుకున్నారు. మృతులు కోజికోడ్ జిల్లాకు చెందిన సాండ్రా (17), తిరువనంతపురం జిల్లాకు చెందిన వైష్ణవి (15)గా గుర్తించారు. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. సాండ్రా ప్లస్ టూ చదువుతున్న అథ్లెటిక్స్ శిక్షణా విద్యార్థిని కాగా, వైష్ణవి కబడ్డీ క్రీడాకారిణి మరియు 10వ తరగతి విద్యార్థిని.ఉదయం శిక్షణా సెషన్‌కు ఆ ఇద్దరూ హాజరు కాకపోవడంతో తోటి హాస్టల్ విద్యార్థులు గమనించి హస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో ఈ విషయం ఉదయం 5 గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. హాస్టల్ అధికారులు తలుపును పగలగొట్టి చూడగా ఆ ఇద్దరు అమ్మాయిలు గదిలోని సీలింగ్ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి వేరే గదిలో ఉంటుందని అయితే బుధవారం రాత్రి సాండ్రా గదిలో గడిపిందని పోలీసులు తెలిపారు. ఉదయం పూట ఇతర హాస్టల్ విద్యార్థులు వారిద్దరినీ చూశారని కూడా పోలీసులు తెలిపారు.కొల్లాం ఈస్ట్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.మరణాలకు గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది . గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు,” అని పోలీసు అధికారులు తెలిపారు.హాస్టల్‌లోని ఇతర క్రీడాకారులు, వారి శిక్షకులు మరియు బంధువుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తామని ఒక అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం పరీక్షల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.




