
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ కోసం అదనంగా రూ.16.27 కోట్ల పరిపాలన అనుమతులు జారీ అయినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో రూ.33 కోట్ల నిధులు చేనేత కార్మికులు రుణమాఫీ గ్రహీత అకౌంట్స్ లో జమ చేయుటకు ఆయా జిల్లాలకు ఈ నిధులను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. 1.4.2017 నుంచి 31.3.2024 వరకు లక్ష రూపాయలు చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తం 6,784 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. చేనేత కార్మికులకు ఎల్లప్పుడు పని కల్పించాలన్న ఉద్ధేశ్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు,
అందుకు అనుగుణంగా ఇప్పటికే రూ.896 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్ఢర్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందిరా మహిళాశక్తి చీరల పథకం ద్వారా 30 వేల మర మగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రూ.150 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన రూ.290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలిపారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత వస్త్ర ప్రదర్శన, వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సంవత్స రంలో జిల్లా సహకార బ్యాంకులు ద్వారా 78 సహకార సంఘాలకు రూ.19 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా తెలియజేశారు.




