
భక్తులు కోర్కెలు తీర్చేకొంగు బంగారం, కొరమీసాల ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభోగంగా ప్రారంభమైయ్యాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు దాదాపు మూడు నెలలపాటు ఈ జాతర కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన నీరాజనమంత్రపుష్పం, తీర్థప్రసాదలతో ఉత్సవాలు ప్రారంభించారు. 14న బోగి పండుగ, 15న మరకసంక్రాంతి బండ్లు తిరుగుట, 16న కనుమ, 17న ఈ మహాసంప్రోక్షణ సమారాధన, 23న భ్రమరాంభికవసంతపంచమి, భ్రమరాంభిక అమ్మవారి త్రయోదశ వార్షికోత్సవం, ఫిబ్రవరి 1న ఎల్లమ్మ దేవత పండుగ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ, దేవాలయ నిధులు, దాతల సహకారంతో అన్ని వసతులు అధికారులు కల్పిస్తున్నారు.




